📅 18 సెప్టెంబర్ 2026
🔴 బ్రేకింగ్
పల్నాడు

అక్రమ కేసులతో వేధిస్తున్నారు

అక్రమ కేసులతో వేధిస్తున్నారు

రాజకీయ వేధింపులతో తమ కుటుంబం పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కోటిరెడ్డి కుటుంబ సభ్యులు విన్నవించారు. మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిసి, తమపై నమోదైన కేసు, అరెస్టు, రిమాండ్‌ పరిస్థితులను వివరించారు.


పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్‌ సింగారెడ్డి లక్ష్మిని ఈనెల 24న పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్‌ చేశారు. కోటిరెడ్డి దంపతులపై అక్రమ కేసు నమోదు చేసిన తీరు, అరెస్టు చేసిన పరిస్థితులు, రిమాండ్‌కు పంపిన విషయాలను, తమకు ఎదురైన పరిణామాలను, పడుతున్న ఇబ్బందులను వారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 75 ఏళ్ల వృద్ధుడైన కోటిరెడ్డిని రిమాండ్‌కు పంపి జైలుకు తరలించడం, 70 ఏళ్ల వయసున్న ఆయన భార్య లక్ష్మిని కూడా కేసులో అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు పరాకాష్ట అని మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.


టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోటిరెడ్డిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వరుస కేసులతో వేధిస్తోందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసుల తీరును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారని, ఇటువంటి చర్యలకు పాల్పడినవారిని రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకుంటామని ఆయన అన్నట్లు విడదల రజిని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో కోటిరెడ్డి సతీమణి లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్‌, మేనల్లుడు మేకల శ్రీనివాసరెడ్డి ఉన్నారు.